నంది వడ్డేమాన్ లో శని త్రయోదశి

కందనూలు, వెలుగు: బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శనీశ్వరస్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా తిల, తైలాభిషేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి శనీశ్వరుడిని దర్శించుకొని నల్ల నువ్వులు, జిల్లేడు పువ్వులు, నువ్వులనూనె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయింది.

దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. శనీశ్వరుడి దర్శనం అనంతరం భక్తులు కాకతీయుల కాలం నాటి గోన గన్నారెడ్డి, గోన బుద్ధారెడ్డి నిర్మించిన 900 ఏండ్ల నాటి శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు గువ్వమటం విశ్వనాథశాస్త్రి, ఆలయ చైర్మన్  గోపాల్ రావు, వీరశేఖర్, ప్రభాకర్, పుల్లయ్య, రాజేశ్, అర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమా మహేశ్వర్, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.